Sunday, October 25, 2009

ఉండ్రాళ్ళ తద్దె , Undralla tadde



ఉండ్రాల తద్దె ఆడపిల్లల పండుగ . మన హిందూ సంప్రదాయము లో............
ఒకరోజు పండుగలు ---------- కృష్ణాష్టమి , (ఉదాహరణానికి )
రెండ్రోజుల పండుగలు -------- నరకచతుర్దశి - దీపావళి , ఉండ్రాలతద్దె .
మూడురోజుల పండుగలు ------భోగి - సంక్రాంతి - కనుమ ,
నెలంతా పండుగ గా ---------- కార్తీక - ఆశ్వయుజ మాసాలు ,

ప్రతి సంవత్సరమూ భాద్రపద బహుళ తదియ నాడు నోచుకునే నోము ఉండ్రాళ్ళ తదియ. ఇది రెండ్రోజుల పండుగ .

  • ముందు రోజు --
ఐదుగురు ముత్తైదువులకి గోరంటాకు ముద్ద ,పసుపు కుంకుమలు ,కుంకుడు కాయలు ,నువ్వులనూనె ఇచ్చి మాయింటికి తాంబూలము తీసుకోవటాని కి రండి అని ఆహ్వానించాలి.

వివాహం కాని ఆడపిల్లలు ఈ రోజు తెల్లవారుజామున తలంటుపోసుకోవాలి . తలంటు అనగానే ఏదో షాంపుతో కాకుండా కుంకుడుకాయల రసం తో తలని రుద్దుకోవాలి . ఆ కుంకుడులోని దేదుతనం క్రిముల్నీ , కీటకాలనీ జుట్టులోనికి రానీయదు . జుట్టులోని తడిని పిడవ (మెత్తని తుండుని చుట్టుకోవడం )ద్వారా బాగా పీల్చుకునేలా చేసుకుని సాంబ్రాణి పొగని పట్టించుకోవాలి . దీంతో జుత్తంతా సువాసనతో నిండడమేకాక , తల తడిసిన కారణం గా శిరోజాల మూలాల వద్ద వున్న తడి పూర్తిగా ఆరిపోతుంది . ఇక గోంగూరపచ్చడితో పెరుగన్నాన్ని తినిపిస్తారు ... పిల్లలందరికీ. ఈ తతంగమంతా ఉదయం 06 గంటలకే పూర్తవ్వాలి . ఇక్కడితో ఈ రోజు పండుగ ముగిసినట్లే .
వైద్య రహస్యము : ఆయుర్వేద శాస్త్రం ప్రకారము గోగూర వేడిచేసే ద్రవ్యము , పెరుగన్నము చలవ చేసే పదార్దము . తలంటు స్నానము అనేది తలని శుభ్రం చెస్తే గోంగూర పెరుగు అన్నము పిల్లలకు చురుకుదనాన్ని ఇస్తుంది . పూర్వం రోజుల్లో పొలాలకెళ్ళే రైతులంతా పెరుగన్నము గోంగూర లేదా ఆవకాయ నంజుకుని వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం రెండుగంటలకి ఆకలితో నకనకలాడుతూ వస్తూండేవారు . ఆ తీరుగా చురుకుదనాన్ని పుట్టిస్తుంది . .. ఈ భోజన మిశ్రమము . కొన్నిచోట్ల నువ్వులపొడుం కూడా ఈ మిశ్రమములో చేరుస్తారు . దీనివల్ల శ్రావణ భాద్రపద మాసాల్లో వర్షాల కారణంగా వచ్చే జలుబు - రొంప , ముక్కు - కళ్ళ మంటలు రానేరావు .

  • రెండవ రోజు :
ఉండ్రాళ్ళతద్దె లోని ప్రత్యేకత తెల్లవారుఝాము భోజనాలు. మళ్ళీ ఇన్నటిలాగే గోంగూర లేదా ఆవకాయ నంచుకుని పెరుగన్నాన్ని తిని అలసిపోయేవరకూ దాగుడుమూతలూ , ముక్కుగిల్లులాటలూ , దూదుంపుల్ల , కోతికొమ్మచ్చి మొదలగు ఆటలు దాదాపు ఉదయం 08 గంతలయ్యేంతవరకూ ఆడుతారు . ఉయ్యాలలూగుతారు. అంతా అయ్యాక ఏ పిల్లకి సంబంధించిన తల్లి రాను తెచ్చిన ఉండ్రాళ్ళని ఆయా కూతురికిస్తే ఆ తల్లీ కూతురూ ఆ ఉండ్రాళ్ళని మరో తల్లీ కూతుళ్ళకిస్తారు . ఈ సందర్భం లో ఈ కూతురు ఆ తల్లికీ , ఆ కూతురు ఈ తల్లికీ నమస్కరిస్తారు . ఇదొక తీరు ఐకమత్యాన్ని పెంపొందించుకునె తీరు -- ఆట , పండుగ అంతేకాదు తర్వాత నెలలో రాబోయే అట్లతద్దికి శిక్షణ వంటిదికూడా .
వైద్య రహస్యము : వేదం లో ఓ స్లోకము ఉంది . వివాహములో దీన్ని చెప్తారుకూడా .
సోమ: ప్రధమో వివిదే గంధర్వో వివిద ఉత్తర: !
తృతీయో అగ్ని స్టే పతి: తురీయ స్తే మనుష్యజ: !! --------------అని

పుట్టిన ప్రతి ఆడపిల్ల మీదా ఒకటి నుండి ఐదో సంవత్సరం వచ్చేవరకూ చంద్రుడు రాజ్యంచేస్తాడట . అందుకే ఆ పిల్లలు బాగా ఆకర్షణీయం గా ఉండాడమే కాక ఎప్పుడూ అలా గుర్తుకొస్తూవుంటారు కూడా . ఏ చంద్రుడు మనస్సుని దృఢం చేస్తుంటాడో ఆ కారణం గ తండ్రి , మామయ , బాబాయి .... ఇలా అందరినీ , మ ఇంటినీ . పొరుగింటినీ కూడా ఇట్టే ఆకర్షించ గలుగుతారు ఈ కాలం లో .
ఆరు నుండి పదో సంవత్సరం వచ్చే వరకూ ఆ పిల్లని చంద్రసాక్షిగా గంధర్వుడు స్వీకరించి రాజ్యం చేస్తాడు . గంధర్వుడు లావణ్యానికి అధినేత కాబట్టి ఆ పిల్లకి అందాన్ని కలిగిస్తాడు . ఆడపిల్లలలో నిజమయిన అందం (ఏ విధమైన దుర్భావకూ లేని అందం ) ఆరు నుండి పడేళ్ళ వరకూ బాగా ఉంటుంది .
ఇక 11 నుండి 15 యేళ్ల మధ్య అగ్నిదేవుడు ఆడపిల్ల బాధ్యతను గంధర్వుని సాక్షిగాస్వీకరిస్తాడు . అగ్నిదేవుడు కామానికి అధిష్టాత కాబట్టి ఆమెలో కామకుణాన్ని 11 వ సంవత్సరం రాగానే ప్రవేశపెడతాడు .

ఈ వయసుకు ముందు మయసులో అనగా 15 సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళంతా శారీరకంగా ఆరోగ్యవతులుగా ఉండే నిమిత్తమే ఈ ఆటలూ , ఉండ్రాల వాయనాలు .

మద్యాహ్నం గౌరీ పూజ. గౌరిని షొడశోపచారాలతో పూజించిన వారికి సమస్త శుభాలు సమకూరుతాయంటారు. ఐదు దారపు పోగులు పోసి, ఐదు ముడులు వేసి , ఏడుతోరాలను అమ్మవారి పక్కనే వుంచి పూజించాలి. ఒక తోరం అమ్మవారికి, ఒకటి నోముకున్నవారికి , మిగితా ఐదు, ఐదుగురు ముత్తైదువులకు కట్టాలి. బియ్యపు పిండిలో బెల్లము కలిపి , పచ్చి చలిమిడి చేసి , ఐదు ఉండ్రాలను చేసి , నైవేద్యం పెట్టాలి.

పూజ తరువాత చేతిలో అక్షింతలనుంచుకొని కథచెప్పుకోవాలి.ఈ వ్రత కథ ఏమిటంటే , పూర్వం ఓ వేశ్య ,తన సౌందర్యం తో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంది. ఒక ఉండ్రాళ్ళతద్దె నాడు ,రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు.ఆమె అహంకారముతో దైవ నింద చేసేసి నోముకో లేదు. పలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకెళ్ళారు. మహా వ్యాది బారాన పడ్డది. తరువాత రాజ పురోహితుడి సలహాతో ఉండ్రాల తద్దె నోము నోచుకొని, తన సంపద ని తిరిగి పొంది, ఆరోగ్యస్తు రాలై శేష జీవితాన్ని ఆద్యాత్మికంగా గడిపి , మరణానంతరం గౌరీ లోకానికి వెళ్ళింది.

ఒక గర్విష్టికే ఈ నోము వలన ఇంతటి సద్గతి లభించింది కదా ! సత్ప్రవర్తన తో ఉండి నోచినవారికి ఇంక ఎంత ఉన్నతమైన పలితముంటుందో ఊహించుకొని సన్మార్గం లో నడవండి ! అనేది ఈ కథలోని నీతి.

హిందు సాంప్రదాయములో నోములు , పూజలకి పెద్ద పీటనే వేసారు. నోము నోచుకుంటేనే సుమంగళిగా వుంటామా ? అందుకోసం వ్రతాలు చేయాలా ? అని వితండ వాదం చేసే వారికి ఏమీ చెప్పలేను . అంత పరిజ్ఞానము నాకు లేదు. నోముకుందాము అనుకోగానే ఇల్లు శుభ్రం చేసి , మామిడాకులు కట్టి, ముగ్గేసి, దేవుడి పీఠానికి పూలూ ,ఆకులు అలంకరించి , ధూప దీప నైవేద్యాల తో పూజించి , ముత్తైదువులకు , తాంబూల మిచ్చి , ఆశీస్సులు తీసుకోవటము తో ఇంటికి ఓ కళ వస్తుంది. మనసు లో ఓ ప్రశాంతత ఏర్పడుతుంది. ఇంట్లో పాజిటివ్ వేవ్స్ వచ్చినట్లుగా వుంటుంది. కుటుంబ శ్రేయస్సు ,ఆద్యాత్మికానందం కలుగుతుంది.
  • ================
 visit my website : Dr.Seshagirirao.com

2 comments:

Unknown said...

Please let us know if there is a place we can download vrata vidhanam for Undralla Tadde.

Surendra Sarma said...

pls tel me, when undralla taddi in 1987